బాలీవుడ్లో ‘ఆపరేషన్ సింధూర్’ అనే టైటిల్ కోసం గట్టిపోటీ నెలకొంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఆపరేషన్ ఆధారంగా యుద్ధ నేపథ్య చిత్రం తీయాలని పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు భావిస్తున్నాయి. ఈ టైటిల్ను రిజిస్టర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో సుమారు 15 మంది నిర్మాతలు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA)లో దరఖాస్తు చేసారు. ఇందులో టీ సీరీస్, జీ స్టూడియోస్, మధుర్ భండార్కర్ వంటి టాప్ నిర్మాణ సంస్థలు కూడా ఉన్నట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో బాలీవుడ్లో యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించాలన్న క్రేజ్ బాగా పెరిగింది. ఉరి, ఫైటర్, వార్, ఛావా లాంటి హిట్ల తర్వాత యుద్ధ నేపథ్య సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ‘ఆపరేషన్ సింధూర్’ సినిమాగా రూపొందితే, అది పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకుల అభిప్రాయం. అందుకే ముందస్తుగా టైటిల్ను తమ పేరిట నమోదు చేసుకోవాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికి సినిమా ఎవరూ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ పోటీ చూస్తే ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారీ ప్రాజెక్ట్ ముంగిట ఉందని చెప్పవచ్చు. టైటిల్ ఎవరికి దక్కితే.. వారే ఈ భారీ కథను తెరపై ఆవిష్కరించే అవకాశం దక్కనుంది.