ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన అభిమానం మరోసారి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్‌లో మోదీని ‘అనికేత్’గా అభివర్ణించారు. ఈ పదానికి అర్థం ఏమిటంటే – ‘ఇల్లు లేకుండా జీవించే వారు’ అని ఆయన వివరించారు. అనికేత్ అనే పదం శివుని పేరుగా కూడా ప్రస్తావించబడుతుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ సన్యాస జీవితాన్ని, దేశభక్తిని, సామాజిక సంక్షేమ పథకాల్ని గుర్తుచేస్తూ పవన్ ప్రశంసలు కురిపించారు.
పవన్ కళ్యాణ్ ప్రకారం, మోదీకి స్వంత ఇల్లు లేకపోయినా, ఆయన ప్రణాళికలో భాగంగా అమలవుతున్న ‘ప్రధాన్ మంత్రీ ఆవాస్ యోజన’ ద్వారా కోట్లాది మందికి ఇళ్ల కల సాకారమైందని అన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, దేశం మొత్తం మోదీకి ఇల్లుగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ఆయన జీవితం కొనసాగుతుందంటూ పవన్ వివరించారు.
ఇక ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలు చేపట్టిన అంశాన్ని పవన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సాయుధ దళాలు నిర్వహించిన దాడుల్లో 30 మందికి పైగా కీలక ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. ఇది దేశం గర్వపడే స్థితి అని పేర్కొన్నారు.
అంతేకాదు, దేశ భద్రతపై సామాజిక మాధ్యమాల్లో బాధ్యతలతో వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సూచిస్తూ.. దేశ విరుద్ధంగా ఎలాంటి పోస్టులు చేస్తే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేశ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామిగా ఉండాలని పిలుపునిచ్చారు.