మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాకు సంబంధించి భారీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతారను ఎంపిక చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. స్పెషల్ వీడియో ద్వారా ఈ అఫీషియల్ కన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో విడుదల చేయగా, ఫ్యాన్స్ విపరీతంగా స్పందిస్తున్నారు.
ఈ వీడియోలో నయనతార మేకప్ రూమ్‌లో తెలుగులో మాట్లాడుతున్న దృశ్యాలు, చిరంజీవి పాటలు వినిపించే కారు సన్నివేశం, చివరగా చిరు స్టైల్‌లో “సంక్రాంతికి రఫ్పాడించేద్దాం” అన్న డైలాగ్‌తో ఫ్యాన్స్‌ను ఫుల్ మీల్స్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రం ద్వారా నయనతార- చిరంజీవి కాంబో ముచ్చటగా మూడోసారి స్క్రీన్‌పై దర్శించనుంది. గతంలో ‘సైరా నరసింహారెడ్డి’, ‘గాడ్ ఫాదర్’ చిత్రాల్లో కలిసి నటించిన వీరి కాంబినేషన్‌కి మంచి క్రేజ్ ఉంది. ఈసారి కూడా అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
కామెడీ, యాక్షన్ మిక్స్‌తో తెరకెక్కనున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నారు. భీమ్స్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో చిరంజీవి పాత్ర పేరు “శివశంకర్ వరప్రసాద్”గా ఉండబోతుందని దర్శకుడు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు సినిమాలో రెండో హీరోయిన్‌కి అవకాశం ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. అదితిరావు హైదరిని సంప్రదించినట్లు సమాచారం. షూటింగ్ ఈ నెల 22న ప్రారంభమవుతుందని టాక్.
ఇతర ప్రాజెక్టుల విషయానికి వస్తే, ప్రస్తుతం మెగాస్టార్ ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ ప్రాజెక్ట్‌తో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.