కోట్ల విలువైన బంగారు ఆభరణాలను సమర్పించిన పారిశ్రామికవేత్త
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి ఐపీఎల్ టీం లక్నో సూపర్ జెయింట్స్ యజమాని, ప్రముఖ పారిశ్రామికవేత్త సంజీవ్ గోయెంకా భారీ విరాళం అందజేశారు. స్వామివారికి అయిదు కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను ఆయన సమర్పించారు.
ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్‌గా కూడా సేవలందిస్తున్న గోయెంకా, శుక్రవారం (మే 15) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని, ఆలయ అధికారులకు ఈ విలువైన బంగారు ఆభరణాలను అప్పగించారు. మొత్తం ఐదు కిలోల బంగారంతో రూపొందించిన ఈ ఆభరణాల్లో “కటి హస్తం” (నడుము భాగాన్ని అలంకరించే ఆభరణం), “వరద హస్తం” (అనుగ్రహ హస్తానికి ఉపయోగించే ఆభరణం) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా టీటీడీ అధికారులు సంజీవ్ గోయెంకాకు సత్కారం చేశారు. తిరుమల తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలతో గౌరవించారు. అనంతరం గోయెంకా మాట్లాడుతూ.. “తిరుమల శ్రీవారి దివ్యదర్శనం కలగడం, స్వయంగా ఆయనకు సేవ చేసే అవకాశం రావడం నా జీవితంలో ఒక అరుదైన మరియు పవిత్రమైన అనుభవం” అని వ్యాఖ్యానించారు.
తిరుమల శ్రీవారి పట్ల తమ భక్తి భావాన్ని వ్యక్తపరుస్తూ, వ్యాపార ప్రముఖుల విరాళాలు, దాన ధర్మాలు ప్రతి ఏడూ ప్రధానంగా నిలుస్తున్నాయి. ఈ కార్యక్రమం కూడా అదే కోవలో చేరటం ఓ విశేషం.